ఆమె మేజర్..నచ్చిన వ్యక్తిని చేసుకోవచ్చు : అలహాబాద్ కోర్టు


మతాంతర వివాహాలపై అలహాబాద్‌ హైకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. ఉత్తర్ ప్రదేశ్‌లో హిందు వర్గానికి చెందిన ఓ యువతి, ముస్లిం యువకుడిని పెళ్లి చేసుకున్న కేసులో ఆ వివాహం చట్టబద్ధమైందిగా పేర్కొంది. పౌరులకు రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులకు లోబడే ఆ యువతీ యువకులు వివాహం చేసుకున్నారని పేర్కొంది. తమ కుమార్తెను కిడ్నాప్‌ చేసి బలవంతంగా మతమార్పిడి చేసి పెళ్లి చేసుకున్నారని యువతి కుటుంబ సభ్యులు దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టివేసింది.


ఉత్తర్ ప్రదేశ్‌లోని కుషీనగర్‌కు చెందిన ప్రియాంక ఖన్వార్‌ అదే ప్రాంతానికి చెందిన సలామత్‌ అన్సారీ కొన్నేళ్లుగా ప్రేమించుకున్నారు. 2019 ఆగస్టులో పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్నారు. వివాహానికి ముందు మతం మారిన ప్రియాంక తన పేరును కూడా ఆలియాగా మార్చుకుంది. అయితే.. ఈ పెళ్లిపై ప్రియాంక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మైనర్‌ అయిన తన కుమార్తెను కిడ్నాప్‌ చేసి, బలవంతంగా మతం మార్పించి పెళ్లి జరిపించారంటూ ఆరోపించారు. ప్రియాంక తండ్రి ఫిర్యాదు మేరకు.. పోలీసులు సలామత్‌ సహా నలుగురిపై పోస్కో చట్టం కింద కేసు నమోదు చేశారు. దీంతో సలామత్‌, ప్రియాంక దంపతులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. తమకు రక్షణ కల్పించాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు.


ఆ దంపతుల పిటిషన్‌పై అలహాబాద్‌ న్యాయస్థానం మంగళవారం (నవంబర్ 22) విచారణ చేపట్టింది. పెళ్లి సమయంలో ప్రియాంక అలియాస్‌ ఆలియా వయసు 21 ఏళ్ల అని, ఆమె మైనర్‌ కాదని న్యాయస్థానం పేర్కొంది. ఈ కేసులో ఇదే కీలకమైన అంశమని.. పోస్కో చట్టం వర్తించదని స్పష్టం చేసింది. ఆ యువతి తన భర్తతో కలిసి జీవించేందుకు అనుమతి కల్పించింది. సలామత్‌, మరో ముగ్గురిపై ఉన్న కేసును కొట్టివేసింది.


9 views

Recent Posts

See All