ఆస్ట్రేలియా టూర్‌కు రోహిత్, ఇషాంత్ దూర‌మ‌య్యే అవ‌కాశాలు ?

కీల‌క‌మైన ఆస్ట్రేలియా టూర్‌కు టీమిండియా ఇద్ద‌రు సీనియ‌ర్ ప్లేయ‌ర్స్ సేవ‌లు కోల్పోయేలా క‌నిపిస్తోంది. తొడ కండ‌రాల గాయంతో బాధ‌ప‌డుతున్న రోహిత్‌, ప‌క్క‌టెముక‌ల గాయంతో బాధ‌ప‌డుతున్న ఇషాంత్‌.. ఆస్ట్రేలియా టూర్ మొత్తానికి దూర‌మ‌య్యే అవ‌కాశాలు ఉన్నాయి. ప్ర‌స్తుతం ఈ ఇద్ద‌రూ బెంగ‌ళూరులోని నేష‌న‌ల్ క్రికెట్ అకాడ‌మీ (ఎన్సీఏ)లో ఫిట్‌నెస్ క‌స‌ర‌త్తులు చేస్తున్నారు. ఐపీఎల్‌లో గాయ‌ప‌డిన రోహిత్‌.. వ‌న్డే, టీ20 సిరీస్‌ల‌కు మిస్ అయినా టెస్టుల‌కు వెళ్తాన‌ని చెప్పాడు. అయితే టీమిండియా కోచ్ రవిశాస్త్రి మాత్రం.. మ‌రో మూడు, నాలుగు రోజుల్లో రోహిత్ ఫ్లైట్ ఎక్కితేనే టెస్ట్ సిరీస్‌లో ఆడ‌గ‌ల‌డ‌ని స్ప‌ష్టం చేశాడు. ఇప్పుడున్న ప‌రిస్థితి చూస్తుంటే ఈ ఇద్ద‌రూ ఇప్ప‌ట్లో విమానం ఎక్కేలా లేరు. ఇటు ఎన్సీఏ నుంచి కానీ, అటు బీసీసీఐ నుంచి కానీ వీళ్ల ఫిట్‌నెస్ గురించి ఇండియ‌న్ టీమ్ మేనేజ్‌మెంట్‌కు ఎలాంటి స‌మాచారం అంద‌లేదు. ఆస్ట్రేలియాలో అడుగుపెట్టిన త‌ర్వాత 14 రోజుల క్వారంటైన్ త‌ప్ప‌నిస‌రి. డిసెంబ‌ర్ 17న తొలి టెస్ట్ జ‌ర‌గ‌నుంది. ఆ లెక్క‌న తొలి టెస్ట్‌కు వాళ్లు అందుబాటులో ఉండే అవ‌కాశ‌మే లేదు. క‌నీసం బాక్సింగ్ టెస్ట్‌లోనైనా ఆడాలంటే మూడు, నాలుగు రోజుల్లో విమానం ఎక్కాలి.

3 views