టీఆర్ఎస్‌కు షాక్.. బీజేపీలో చేరిన స్వామిగౌడ్

గ్రేటర్ ఎన్నికల వేళ తెలంగాణ రాజకీయాలు శరవేగంగా మారిపోతున్నాయి. టీఆర్ఎస్, ఎంఐఎం ధీటుగా ప్రచారం చేస్తున్న బీజేపీ.. అదే సమయంలో పెద్ద ఎత్తున ఆపరేషన్ ఆకర్ష్‌కు తెరలేపింది. ఇప్పటికే పలువురు టీఆర్ఎస్ కార్పొరేటర్లు తమ పార్టీలో చేర్చుకుంది. వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా ఇప్పటి నుంచే పక్కాగా వ్యూహాలను రచిస్తోంది. ఇతర పార్టీల నుంచి ముఖ్యమైన నేతలను తమ వైపు ఆకర్షిస్తోంది. దుబ్బాకలో బీజేపీ విజయంతో పక్క పార్టీల్లోని నేతలు కూడా కాషాయం వైపు చూస్తున్నారు. ఈ క్రమంలోనే టీఆర్ఎస్‌కు బిగ్ షాక్ ఇచ్చారు స్వామిగౌడ్. అందరూ ఊహించినట్లుగానే గులాబీ దళానికి గుడ్‌బై చెప్పి.. కషాయ తీర్థం పుచ్చుకున్నారు.

ఇవాళ ఢిల్లీ వెళ్లిన స్వామిగౌడ్.. బీజేపీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు. ఆయన్ను జేపీ నడ్డా సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. బీజేపీలో చేరిన అనంతరం మీడియాతో మాట్లాడిన స్వామి గౌడ్.. '' బీజేపీలో చేరికతో తిరిగి నా ఇంటికి వచ్చినట్లుంది. ఆత్మగౌరవం కోసం తెలంగాణ పోరాటం జరిగింది. రాష్ట్రం సాధించుకున్నా ఎలాంటి మార్పు లేదు. ఉద్యమకారులను దూరం పెట్టారు. నా నిర్ణయాన్ని కేసీఆర్ ఆమోదిస్తారని అనుకుంటున్నా. పదువులు ఆశించకుండా బీజేపీలో చేరాను. ఉద్యమకారులకు బీజేపీలో తగిన గౌరవం లభిస్తుంది.'' అని అన్నారు.

13 views