రాజ్యాంగం నుంచి ‘సెక్యులర్’ పదాన్ని తొలగించడం ప్రభుత్వానికి సాధ్యమేనా?"కొందరు 'సెక్యులర్' అనే పదం రాజ్యాంగంలో ఉంది కాబట్టి దాన్ని పాటించాల్సిందేనని అంటున్నారు. దీన్ని మేం గౌరవిస్తాం. అయితే రానున్న కాలంలో ఇది మారిపోతుంది. రాజ్యాంగంలో గతంలో కూడా సవరణలు జరిగాయి. రాజ్యాంగంలో ఇప్పటి వరకు వందకు మించి సవరణలు జరిగాయన్న మాట వాస్తవమే. కానీ పార్లమెంటుకు రాజ్యాంగం మౌలిక సిద్ధాంతాలను మార్చే అధికారం ఉందా అన్నది ప్రశ్న.


మొట్టమొదట 1973లో ఈ కేసు సుప్రీంకోర్టు ముందుకు వచ్చింది. ఈ కేసులో ప్రధాన న్యాయమూర్తి ఎస్.ఎం. సిక్రీ అధ్యక్షతన 13 మంది న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం చరిత్రాత్మక తీర్పునిచ్చింది. 'కేశవానంద భారతి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ'గా ప్రసిద్ధి గాంచిన ఈ కేసుపై విచారణ 68 రోజుల పాటు కొనసాగింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 368 పార్లమెంటుకు రాజ్యాంగంలో సవరణ చేసే అధికారం కల్పిస్తుంది. అయితే దీని పరిమితి ఏమిటి? 1973లో ఈ కేసుపై విచారణ సందర్భంగా న్యాయమూర్తుల మధ్య భిన్నాభిప్రాయం తలెత్తింది. చివరకు, పార్లమెంటుకు రాజ్యాంగంలో సవరణలు చేసే అధికారమైతే ఉంది గానీ అది రాజ్యాంగ పీఠిక మౌలిక చట్రాన్ని మాత్రం మార్చజాలదని ఏడుగురు న్యాయమూర్తులతో కూడిన మెజారిటీ తీర్పునిచ్చింది. ఏ సవరణా రాజ్యాంగ పీఠిక స్ఫూర్తికి విరుద్ధంగా ఉండడానికి వీలు లేదని సర్వోన్నత న్యాయస్థానం తన తీర్పులో ప్రకటించింది.


ఈ తీర్పు రాజ్యాంగాన్ని అత్యున్నతమైనదిగా ప్రకటించడం వల్ల చరిత్రాత్మకమైందని అంటారు. న్యాయ సమీక్ష, లౌకికవాదం, స్వతంత్ర ఎన్నికల వ్యవస్థ, ప్రజాస్వామ్యం.. వీటిని రాజ్యాంగపు మౌలిక చట్రంలో భాగమని తీర్పులో పేర్కొన్నారు. రాజ్యాంగపు మౌలిక చట్రాన్ని పార్లమెంటు దెబ్బతీయజాలదని స్పష్టం చేశారు. రాజ్యాంగానికి ఆత్మ పీఠిక. మొత్తం రాజ్యాంగమంతా దీనిపైనే ఆధారపడి ఉందని ఆ తీర్పు వ్యాఖ్యానించింది.


పీఠికలో ఇప్పటి వరకు ఒక్కసారే 1976లో సవరణ చేశారు. అందులో 'సెక్యులర్', 'సోషలిస్టు' అనే పదాలను చేర్చారు. అయితే లౌకికవాద భావన అంతకు ముందు నుంచే పీఠికలో ఉంది.

పౌరులందరీ భావాలు, భావ ప్రకటన, విశ్వాసం, మతం, ప్రార్థనలు చేసుకునే స్వేచ్ఛ, సమానత్వపు హక్కులను పీఠికలో లిఖితపూర్వకంగా పేర్కొన్నారు. 1976లో జరిగిన 42వ రాజ్యాంగ సవరణ ద్వారా 'సెక్యులర్' అనే పదాన్ని చేర్చి దీనికి స్పష్టతనిచ్చారు.


1971లో ఇందిరాగాంధీ ప్రభుత్వం రాజ్యాంగంలో చేసిన కొన్ని సవరణల ద్వారా పార్లమెంటు అధికారాలు అదుపు లేకుండా పెరిగిపోయాయి. న్యాయస్థానాల అధికారాలకు కూడా కత్తెర పడింది. ఆ తర్వాత 1973లో కేశవానంద భారతి కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన 703 పేజీల తీర్పు.. పార్లమెంటుకు అనియంత్రిత అధికారాలుండవని స్పష్టం చేసింది.


అనంతరం 1998లో వాజ్‌పేయి ప్రభుత్వం రాజ్యాంగ సమీక్ష కోసం ఓ కమిటీని వేసింది. ఇది రాజ్యాంగం మౌలిక చట్రాన్ని ప్రభావితం చేసే ప్రయత్నమేనని నాడు చర్చ మొదలైంది. లౌకికవాదాన్ని, రిజర్వేషన్లను అంతమొందించడం కోసమే ఈ ప్రయత్నాలనే విమర్శలు వెల్లువెత్తాయి. అయితే ఆ సమయంలో హోంమంత్రిగా ఉన్న లాల్ కృష్ణ ఆడ్వాణీ ఒక సుదీర్ఘ వ్యాసం రాశారు. అందులో ఆయన కేశవానంద భారతి కేసును ఉటంకిస్తూ సెక్యులరిజం భారతీయ సంస్కృతిలో భాగమని పేర్కొన్నారు.


భారతదేశం సెక్యులర్‌గా ఉన్నది కేవలం అది రాజ్యాంగంలో రాసి ఉన్నందువల్ల మాత్రమే కాదు అని ఇటీవల భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు మైనారిటీ కమిషన్‌ సమావేశంలో చేసిన ప్రసంగంలో అన్నారు. సెక్యులరిజం మన 'డీఎన్‌ఏ'లో భాగంగా ఉంది కనుకనే భారతదేశం సెక్యులర్ దేశం అని ఆయన పేర్కొన్నారు.